30, జనవరి 2013, బుధవారం

చిక్కుడుకాయ నూపిండి(నువ్వులపొడి)



  నూపిండి కూర నాటు చిక్కుడుకాయలతో చేసుకుంటే బాగుంటుంది. ఈ సీజన్ లో  బాగా దొరుకుతాయి.

చిక్కుడుకాయలు 1/2కేజి

తాలింపు సరుకులు

సెనగపప్పు
మినప్పప్పు
ఆవాలు
జీలకర్ర
ఎండుమిర్చి
కరివేపాకు

నువ్వుల పిండి కి

నూపప్పు                    - పావుకేజీ
ఎండుమిరపకాయలు  -5
వెల్లుల్లి గబ్బాలు         -7
జీలకర్ర                      -అరస్పూన్
ఉప్పు
బెల్లం


చిక్కుడుకాయలు  మొదలు ,చివర్లు కట్ చేసుకోవాలి. (కట్  చేసేటప్పుడు  ఈనెలు రాకుండా చూడాలి .ఈనెలు ఊడిపోతే కాయలు విడిపోయి తొక్కలు,గింజల్లా ఉండి కూర బాగోదు.)కట్ చేసుకున్నవాటిని కొద్దిగా ఉప్పు,పసుపు వేసుకుని  ఉడకబెట్టుకోవాలి.  రెండు కూతలొస్తే  చాలు.ఎక్కువ ఉడికితే  కాయలు విడిపోతాయి .

 తాలింపు పెట్టుకుని ,తాలింపులో  ఉడకబెట్టిన చిక్కుడుకాయలను ఐదు నిముషాలు కాయలు విడిపోకుండా వేయించుకుని  పక్కన పెట్టుకోవాలి

నూపొడికి

 నూపప్పు  ,ఎండుమిరప కాయలు    వేపుకోవాలి . చల్లారక  ముందుగా  ఎండు మిరపకాయలు ,ఉప్పు,వెల్లుల్లి  ,జీలకర్ర  మిక్సిలో వేసుకుని  ,పోడయ్యాక  నూపప్పు   వేసుకోవాలి  .(నూపప్పు  ఎక్కువసేపు  తిప్పకూడదు .తిప్పితే ముద్దలా అవుతుంది)నలిగాక  బెల్లం కూడా  వేసి పొడి చేసుకోవాలి.ఈ పొడిని  వేపుకున్న చిక్కుడుకాయ కూరలో కలుపుకోవాలి.

ఈ నువ్వుల పొడి  విడిగా  కూడా  వేడివేడన్నం లో నెయ్యి వేసుకుని తింటే  చాలా రుచిగా ఉంటుంది.

పొట్లకాయ,ఆనపకాయ  తో కూడా  ఇలా నూపిండి  కూర చేసుకోవచ్చు .




19, డిసెంబర్ 2012, బుధవారం

గుమ్మడికాయ దప్పళం




మా వైపు ఫంక్షన్లలో ,పెళ్ళిళ్ళ లో  ఎక్కువగా గుమ్మడికాయ దప్పళం వండుతారు.దీనినే పులుసు ,కలగలుపు అని కూడా అంటారు.





దీనికీ కావలసిన పదార్దాలు...

గుమ్మడికాయ -చిన్నది ఒకటి
ఆనప కాయ -చిన్న ముక్క 

ఉల్లిపాయలు -రెండు
పచ్చిమిర్చి -ఆరు
బెండకాయలు -పది
టమాటాలు -మూడు
ములక్కాడ -ఒకటి
వంకాయలు -రెండు
కొత్తిమీర-ఒకకట్ట


పోపు పెట్టుకోవడానికి

చీరికలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు -గుప్పెడు 
మెంతులు -అర స్పూను
ఆవాలు -అరస్పూను
జీలకర్ర -అరస్పూను 

ఎండుమిరప కాయలు -రెండు 
కరివేపాకుకొద్దిగా 
చింతపండు కొద్దిగా 
బెల్లం కొద్దిగా

తయారుచేసేవిదానం .....

గుమ్మడికాయ ,ఆనపకాయ  ముక్కలు కాస్త పెద్దగా కోసుకోవాలి . గిన్నె లో నీరు పోసి,గుమ్మడికాముక్కలు,ఆనపకాయ  ముక్కలు వేయాలి .అవి కాసేపు ఉడకనిచ్చి , ముక్కలుగాకోసుకొన్న మిగిలిన కూరగాయముక్కలు ,ఉల్లిపాయలను పెద్ద ముక్కలుగా కోసుకుని  అవి, పచ్చిమిర్చి ముక్కలు  దానిలోవేయాలి.

కొద్దిగా వుడికాక కారము ,ఉప్పు ,పసుపు వేసుకొని...చింతపండుపులుసు ,బెల్లము  వేసుకోవాలి.

పులుసు చిక్కగా  కావాలనుకుంటే  ఉడకబెట్టిన కందిపప్పు  మెత్తగా చేసి కలుపు కోవాలి .కాసేపు ఉడకనిచ్చి  తాలింపు పెట్టుకోవాలి.

తాలింపులో ముందు ఉల్లిపాయ చీరికలు వేసుకుని వేగేక మిగిలిన తాలింపు సరుకులు వేసుకో వాలి.నూనె తో పాటు అరస్పూన్   నెయ్యి కూడా వేసి తాలింపు పెడితే   బాగుంటుంది.తరువాత కొత్తిమీర జల్లుకోవాలి .

దప్పళం  వండినప్పుడు  ముద్దపప్పు  తప్పకుండా  ఉండాలి .

దీనిని ముద్దపప్పులో కలుపుకొని తింటే ఉంటుందీ ..........

పపపపప్పు ..దప్పళం ......

వేడి వేడి అన్నం మీద....కమ్మనిపప్పు కాచిన నెయ్యి ...కలిపితే ...


26, నవంబర్ 2012, సోమవారం

గోదుమరవ్వ కేసరి ( ప్రసాదం)


  • మా ఊరులో  వ్రతాలు,పూజలు  చేసినప్పుడు ఆవునెయ్యి,ఆవు పాల   తో  గోదుమరవ్వ  కేసరి  ని ప్రసాదంలా చేసి అందరికీ  పంచుతారు.అందుకే   ఈ  రవ్వ కేసరిని   ప్రసాదం అంటాము.



కావలసిన పదార్ధాలు...

గోదుమరవ్వ                            -1కప్పు

పాలు                                     -2 కప్పులు

పంచదార                                -1 కప్పు(తీపి ఎక్కువ కావాలనుకుంటే 1 1/2 కప్పు )

నెయ్యి                                   -1/2 కప్పు

యాలికల పొడి                       -1 స్పూన్

వేయించిన జీడిపప్పు, కిస్మిస్


దీనిని  పాలుతోనే కాదు నీళ్ళ  తోనూ చేసుకోవచ్చు.పాలు తో  చేస్తే రుచి బాగుంటుంది . లేకపోతె 1కప్పుపాలు ,1కప్పు

నీళ్ళ  తో నైనా చేసుకోవచ్చు. ఎలా చేసినాకొలత మాత్రం ఒకటి కి రెండు.

దళసరిగా ఉన్న గిన్నెలో చేస్తే  చేసేటప్పుడు  అడుగున  అంటుకోకుండా ఉంటుంది.

తయారు చేసే  విదానం...

ముందుగా   రవ్వని నెయ్యి లో  వేయించుకోవాలి.దానిని ఒక ప్లేట్లో  పోసి చల్లారనిచ్చి ,పంచదార కలుపుకోవాలి.

ఇలా రెండూ  కలుపుకుంటే  రవ్వ పాలలో వేసినప్పుడు  గడ్డ కట్టకుండా ఉంటుంది.

గిన్నెలో  పాలు పోసి  ,దానిలో రవ్వ ,పంచదార మిశ్రమాన్ని వెయ్యాలి.పాలు గరిటెతో తిప్పుకుంటూ నెమ్మిదిగా

వేసుకుంటే    ముద్ద ముద్ద లా అవకుండా ఉంటుంది. ఉడకడం  మొదలవ్వగానే  ఒకో స్పూన్ నెయ్యి వేస్తూ

తిప్పుతుండాలి. మిశ్రమం  కొంచెం దగ్గర పడగానే స్టవ్  ఆపేయాలి.  యాలికల పొడి, మిగిలిన నెయ్యి

జీడిపప్పు,కిస్మిస్ వేసి  కలుపుకోవాలి.